Wednesday, May 31, 2006

పురోగమనంలో తిరోగమనం

దూరదర్శిని - ప్రస్తుతం దర్శించయోగ్యం కానిదిగా మారిపోయింది. మురళీ గారు చెప్పినట్టు అమ్మ చేతిలో అలంకృతమై కమ్మని వంటకు కారణం కావలసిన కత్తి హంతకుల చేతిలోనే ఉండిపోతుంది. నా చిన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికల్లా మా కాలనీలో ఒకే ఒక టీవీ ఉన్న ఇంటివైపు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళడం నాకింకా గుర్తుంది! కానీ ఇప్పుడు రూంలో ఎదురుగా ఉన్నా చూడలేని దౌర్భాగ్యం. మనసుకి ఉల్లాసం కలిగించే కార్యక్రమాలకు కాలం చెల్లపోయింది. ముఖ్యంగా గృహిణులపై (ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో ఉండే స్త్రీలు అని నా అభిప్రాయం) దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఇక ప్రసారమయ్యే కార్యక్రమాల సంగతికి వస్తే వినోద సంబందమైనవి కొన్ని, వార్తా సంబందమైనవి కొన్ని. ఏ రాయి అయితేనేంటి పళ్ళూడగొట్టుకోడానికి. సినిమాల కన్నా టీవీలలో వస్తున్న సీరియల్స్ కే మంచి గిరాకీ ఉన్నట్టుంది. మేడిపండు చందాన పేర్లు మాత్రం బాగుంటున్నాయి. విషయం చూస్తే కేక్ కేక్. అనుబందాలు ఆత్మీయతలు ముడిపడ్డ ఇంట్లో జనమంతా కూర్చుని చూడలేని పాత్రల అల్లికలు. అదీ కాకుండా వీవెన్ గారు చెప్పినట్టు ప్రకటనల మద్యలో అప్పుడప్పుడూ కార్యక్రమాలాయె!

ఇక వార్తా చానళ్ళ విషయానికొస్తే నిరంతర వార్తా స్రవంతి అట! పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. ఎలాగోలా వల వేసి ఓ చిన్న చేపను పట్టుకోవడం; తమ గొప్పతనాన్ని చాటుకుంటూ (దీనినే ఢాంబికం అంటారు) ఓ రోజంతా ఆ విషయాన్నే వందసార్లు ప్రసారం చెయ్యడం నిజంగా రోత రోత. లేకపోతే సభల్లో మంత్రులు తిట్టుకోవడమో కొట్టుకోవడమో చూపిస్తారు.నేరాల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్నే కేటాయించారు. చదువరి గారు చెప్పినట్టు తింగరి లంగర్ల చేష్టలకు అంతలేకుండా పోతుంది.

ముఖ్యమైన విషయం మరచిపోయానండీ! ఈ మద్యన సినిమాల కన్నా టివీల వలన చాలా ప్రమాదం గోచరిస్తుంది. ఇది పిల్లలు కాదు పెద్దలు భయపడే విషయం. మనమెవరన్నా చిన్న పిల్లలను సినిమాలకు తీసుకెళ్ళాలంటే సదరు చిత్రంలో అశ్లీలమైనదేదైనా ఉన్నదో లేదో తెలుసుకుని నిర్ణయిస్తాం. కానీ టీవి చూస్తున్నప్పుడు అలా కుదరదు; ఎప్పుడో అకస్మాత్తుగా ఏ ఆంతరంగిక వస్తువు గురించి ప్రకటనో లేకపోతే ఏదైనా సినిమాలోని అసభ్య సన్నివేశమో కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.

- ఇక ఎడారిలో ఒయాసిస్సులా కొద్దో గొప్పో చూడాలనిపించే ఛానల్ ఒకటుందండోయ్! ఈటీవీ2 కొన్ని మంచి కార్యక్రమాలను అందిస్తుంది(ఇది నా అభిప్రాయం). (ఈటీవీ ఈ విషయంలో విలోమంలో ఉంటుంది).

- చివరగా ఎవరినన్నా నొప్పించి ఉంటే క్షమించండి.

6 comments:

మురళీ కృష్ణ said...

మీరు చెప్పింది నిజంగా నిఝం. ఇంకో మాట, ఈటీవీ2 మీరు చెప్పినంతగా కాకపోయినా, గుడ్డిలో మెల్ల. కొన్ని మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. నాకు బాగా నచ్చిన కార్యక్రమం 'తెలుగు వెలుగు'. కానీ ప్రాబ్లమల్లా, ఇంట్లో ఆడాళ్ళు సీరియల్లంటూ చూడనీయరు! ప్చ్‌!!

చేతన said...

అవునండీ బాబూ. నాలుగేళ్ళ తర్వత ఇండియ వెళ్ళీన నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సీరియల్స్, వాణిజ్య ప్రకటనలు సంగతి సరే, వార్తలు కూడా చూడలేకపొతున్నాం. ఏదో జిల్లాలో ఏదొ పల్లెటూరులో ఎవరో స్త్రీని ఆమె భర్త అనుమానించి కత్తితో పొడిచిపొడిచి చంపితే, అది ఆ ఊరి లోకల్ ఎడిషన్‌ పేపర్‌లో రావాలి గానీ, రాష్ట్రం అంతా ప్రసారమయ్యే చానల్‌ న్యూస్‌లో రావాలా? చెప్పారు సరే, రక్తం మడుగులో, బట్టలు చెదిరి, వంకర్లు తిరిగి ఉన్న ఆ శవాన్ని, ఒక రెండు నిముషాల పాటు వీడియో చూపించాలా? పోని ఒకటి అనుకుంటే సరే, వరసగా అలాంటి వార్తలే, అలంటి భీభత్సకరమైన వీడియోసే 2-3 చూసాను మొదటి రోజే నేను. సినిమాల్లో హింస ఎక్కువయిపోతుంది అని గోల పెడుతున్నాం, ఆ స్థాయిని దాటిపోయి ఉంటున్నాయి వార్తా చానళ్ళు.మరీ రోజంతా ప్రసారం చేయటనికి వార్తలు లేనంత మాత్రాన ఈ స్థాయికి దిగజారాలా?

Nagaraja said...

మన టీవీ వారు ఇంగ్లీషు చానళ్ళ మడుగు జాడళ్ళో నడుస్తున్నట్టున్నారు...

shalini said...

మీ "పురోగమనంలో తిరోగమనం" నాకు చాలా బాగా నచ్చింది
వీలైతే మరి కొన్ని post చెయ్యండి
మీరు ఇదంతా తెలుగు వ్రాయటానికి quillpad.in/telugu వాడేర

శ్రీనివాస said...

ధన్యవాదములండి! నేను తెలుగులో రాయడానికి లేఖిని లేదా శ్రీపద్మ ఉపయోగిస్తాను. నేను నా సొంత డొమైన్‌లో నా బ్లాగును కొనసాగిస్తున్నాను... ఇక్కడ చూడండి... హరివిల్లు
- శ్రీనివాసరాజు దాట్ల

telugufriends said...

Let's come together on http://www.apjunction.com to bring all the Telugu people unite on one platform and find Telugu friends worldwide to share our thoughts and create a common bond.

Let's also show the Mightiness of Telugu people by coming together on http://www.apjunction.com