Wednesday, May 31, 2006

పురోగమనంలో తిరోగమనం

దూరదర్శిని - ప్రస్తుతం దర్శించయోగ్యం కానిదిగా మారిపోయింది. మురళీ గారు చెప్పినట్టు అమ్మ చేతిలో అలంకృతమై కమ్మని వంటకు కారణం కావలసిన కత్తి హంతకుల చేతిలోనే ఉండిపోతుంది. నా చిన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికల్లా మా కాలనీలో ఒకే ఒక టీవీ ఉన్న ఇంటివైపు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళడం నాకింకా గుర్తుంది! కానీ ఇప్పుడు రూంలో ఎదురుగా ఉన్నా చూడలేని దౌర్భాగ్యం. మనసుకి ఉల్లాసం కలిగించే కార్యక్రమాలకు కాలం చెల్లపోయింది. ముఖ్యంగా గృహిణులపై (ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో ఉండే స్త్రీలు అని నా అభిప్రాయం) దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఇక ప్రసారమయ్యే కార్యక్రమాల సంగతికి వస్తే వినోద సంబందమైనవి కొన్ని, వార్తా సంబందమైనవి కొన్ని. ఏ రాయి అయితేనేంటి పళ్ళూడగొట్టుకోడానికి. సినిమాల కన్నా టీవీలలో వస్తున్న సీరియల్స్ కే మంచి గిరాకీ ఉన్నట్టుంది. మేడిపండు చందాన పేర్లు మాత్రం బాగుంటున్నాయి. విషయం చూస్తే కేక్ కేక్. అనుబందాలు ఆత్మీయతలు ముడిపడ్డ ఇంట్లో జనమంతా కూర్చుని చూడలేని పాత్రల అల్లికలు. అదీ కాకుండా వీవెన్ గారు చెప్పినట్టు ప్రకటనల మద్యలో అప్పుడప్పుడూ కార్యక్రమాలాయె!

ఇక వార్తా చానళ్ళ విషయానికొస్తే నిరంతర వార్తా స్రవంతి అట! పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. ఎలాగోలా వల వేసి ఓ చిన్న చేపను పట్టుకోవడం; తమ గొప్పతనాన్ని చాటుకుంటూ (దీనినే ఢాంబికం అంటారు) ఓ రోజంతా ఆ విషయాన్నే వందసార్లు ప్రసారం చెయ్యడం నిజంగా రోత రోత. లేకపోతే సభల్లో మంత్రులు తిట్టుకోవడమో కొట్టుకోవడమో చూపిస్తారు.నేరాల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్నే కేటాయించారు. చదువరి గారు చెప్పినట్టు తింగరి లంగర్ల చేష్టలకు అంతలేకుండా పోతుంది.

ముఖ్యమైన విషయం మరచిపోయానండీ! ఈ మద్యన సినిమాల కన్నా టివీల వలన చాలా ప్రమాదం గోచరిస్తుంది. ఇది పిల్లలు కాదు పెద్దలు భయపడే విషయం. మనమెవరన్నా చిన్న పిల్లలను సినిమాలకు తీసుకెళ్ళాలంటే సదరు చిత్రంలో అశ్లీలమైనదేదైనా ఉన్నదో లేదో తెలుసుకుని నిర్ణయిస్తాం. కానీ టీవి చూస్తున్నప్పుడు అలా కుదరదు; ఎప్పుడో అకస్మాత్తుగా ఏ ఆంతరంగిక వస్తువు గురించి ప్రకటనో లేకపోతే ఏదైనా సినిమాలోని అసభ్య సన్నివేశమో కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.

- ఇక ఎడారిలో ఒయాసిస్సులా కొద్దో గొప్పో చూడాలనిపించే ఛానల్ ఒకటుందండోయ్! ఈటీవీ2 కొన్ని మంచి కార్యక్రమాలను అందిస్తుంది(ఇది నా అభిప్రాయం). (ఈటీవీ ఈ విషయంలో విలోమంలో ఉంటుంది).

- చివరగా ఎవరినన్నా నొప్పించి ఉంటే క్షమించండి.

Friday, April 14, 2006

ఆవేదన

ఈ రోజు కాస్త బాదనిపించింది. నేను నా గదిలో వికీపీడియాలో సమాచారాన్ని టైపు చెయ్యడం చూసి నా స్నేహితుడొకడు తనకి నేను చేస్తున్న పని రామకోటిలా ఉందని హేళన చేసాడు. ఆ రామకోటి రాస్తే ఏదో పుణ్యం వస్తుందన్న స్వార్ధంతో రాస్తారు. కానీ నేను చేస్తున్న పని ఏ స్వప్రయోజనమూ ఆశించి చేస్తున్నది కాదని మాతృభాష మాధుర్యం తెలిసిన వారికి గానీ తెలియదు. ప్రపంచీకరణ పేరు చెప్పి మూలాల్ని మరచిపోవడం ఆత్మద్రోహమని మన తెలుగు వాళ్ళంతా ఎప్పుడు తెలుసుకుంటారు భగవంతుడా!

Monday, March 13, 2006

నా మాట

నా తల్లి నేర్పిన మొదటి పలుకు తెలుగు
నా తండ్రి కట్టిన పట్టుదట్టీ తెలుగు
నా చెల్లి బుగ్గన సిగ్గునిగ్గు తెలుగు
నా చెలియ కన్నుల వెలుగురేఖ తెలుగు